Hyderabad : వీధి కుక్క దాడి.. ఆరేళ్ల బాలుడికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2023 4:35 PM IST
Hyderabad : వీధి కుక్క దాడి.. ఆరేళ్ల బాలుడికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నంది ముసలాయిగూడలో చోటుచేసుకుంది. దాడి తరువాత, బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బహదూర్‌పురా ఎస్‌హెచ్‌ఓ డి అనిల్ కుమార్ ఈ సంఘటన ఆదివారం జరిగిందని ధృవీకరించారు. బాలుడు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వీధికుక్కల దాడి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాలతో మృతి చెందిన ఘటనను ఎవరూ మరచిపోలేదు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కోమళ్ల మహేశ్వరి అనే 13 ఏళ్ల బాలిక వీధికుక్కల దాడిలో గాయపడి మృతి చెందింది. పోచమ్మపల్లి ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఆమె మానోకొండూరు మండల కేంద్రంలోని పోచమ్మపల్లి గ్రామ శివారులోని తన నివాసం బయట హోంవర్క్‌ చేస్తుండగా వీధికుక్కలు దాడి చేశాయి. దాదాపు 40 రోజుల పాటు చికిత్స తీసుకున్నా ఆమె ప్రాణాలను అధికారులు కాపాడలేకపోయారు.


Next Story