హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ ఛత్రినాకలోని ఓ రెండంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డ వెంటనే ఆ భవనంలో ఉన్న నివాసితులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అందులో చెప్పుల గోదాం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఛత్రినాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం సంభవించడం ఆందోళనకు గురి చేసింది.