అహ్మదాబాద్ నుండి తెచ్చారు.. నోట్లు పంచడం మొదలెట్టారు

టైటిల్ చూసి ఎవరో డబ్బులు పంచే కుబేరులు వచ్చారని అనుకోకండి.

By Medi Samrat
Published on : 14 March 2025 4:00 PM IST

అహ్మదాబాద్ నుండి తెచ్చారు.. నోట్లు పంచడం మొదలెట్టారు

టైటిల్ చూసి ఎవరో డబ్బులు పంచే కుబేరులు వచ్చారని అనుకోకండి. వీరంతా దొంగనోట్ల చెలామణీ చేస్తున్న వ్యక్తులు. నకిలీ కరెన్సీ నోట్లను తెలంగాణలో మారుస్తూ, అమ్ముతూ ఉన్న ఏడుగురు వ్యక్తుల ముఠాను ఎల్‌బి నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అహ్మదాబాద్‌కు చెందిన సురేష్ భాయ్ పరారీలో ఉన్నాడు.

నిందితులు చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, మలిల్లా జనయ్య, భరత్ కుమార్, వెంకటేష్, సత్యన్రాయన, జి.వెంకటేష్, కె. శివ కుమార్ గా పోలీసులు గుర్తించారు. తన భార్య గుండెపోటుతో మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిన మాణిక్య రెడ్డి సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతుకుతున్నాడు. ఆన్‌లైన్‌లో నకిలీ కరెన్సీ నోట్ల అమ్మకం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకున్నాడు. అలా హైదరాబాద్ నగరంలో దొంగనోట్ల చెలామణీకి శ్రీకారం చుట్టారు. నిందితులు పలువురిని కలిసి రూ.లక్ష ఇస్తే రూ.4 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్​ పోలీసులు గుట్టుగా దర్యాప్తు జరిపి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షల అసలు కరెన్సీని, రూ.11.5 లక్షల నకిలీ నోట్లు, 10 నకిలీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అహ్మదాబాద్‌కు చెందిన సురేష్ భాయ్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.

Next Story