సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్ దాఖలు
సంధ్య 70ఎంఎం థియేటర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం తెలిపారు.
By - Medi Samrat |
సంధ్య 70ఎంఎం థియేటర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం తెలిపారు. సమగ్రమైన, వివరణాత్మక దర్యాప్తు తర్వాత, 24వ తేదీన న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో 14 మంది నిందితులను అరెస్టు చేయగా.. ముందస్తు బెయిల్ పొందిన 9 మంది నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ సంఘటన సమయంలో థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, సంబంధిత ఇతరుల మధ్య ప్రణాళిక, జన సమూహ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు మరియు సమన్వయంలో లోపాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.
2024లో చోటు చేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ఇందులో ఏ11గా హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. ఈ కేసులో ఏ1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ను పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి, ఓ మహిళ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అల్లు అర్జున్, అతని మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు బౌన్సర్లపైనా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు.
2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ వేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడికి వచ్చాడు. చాలా మంది జనాలు ఉండటంతో వద్దని చెప్పినా అల్లు అర్జున్ కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి చేతులు ఊపుతూ ర్యాలీగా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. అల్లు అర్జున్ ను దగ్గర నుంచి చూడాలని అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతిచెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ఇప్పటికీ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రోజు రాత్రి అతడు జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ విషయం కలకలం రేపింది.