శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్.. కిచెన్ ఎలా ఉందంటే?

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని శాంటామారియా ఇంటర్నేషనల్ స్కూల్‌లోని కిచెన్ ఏరియాను పరిశీలించారు అధికారులు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Sep 2023 2:02 PM GMT
శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్.. కిచెన్ ఎలా ఉందంటే?

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని శాంటామారియా ఇంటర్నేషనల్ స్కూల్‌లోని కిచెన్ ఏరియాను పరిశీలించారు అధికారులు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రత ఉల్లంఘనలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. శాంటామారియా ఇంటర్నేషనల్ స్కూల్‌ నిర్వహణ ప్రమాణాలు సరిగా లేవని హైదరాబాద్ మేయర్ కార్యాలయానికి పలుమార్లు ఫిర్యాదులు రావడంతో సెప్టెంబర్ 14న సాయంత్రం 4 గంటలకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలు పాఠశాల యాజమాన్యం పాటించడం లేదని తెలుస్తోంది.

20, 21, 22 సర్కిళ్లకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎన్నో లోపాలను గుర్తించారు. పలు ఉల్లంఘనలకు పాల్పడ్డట్టు తేలడంతో పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు. తనిఖీ గురించి ఆహార భద్రత విభాగం అదనపు డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, “శాంటామారియా పాఠశాలలో వంటశాలల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని హైదరాబాద్ మేయర్ కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించగా.. అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించాము. వంటగది అధ్వాన్నంగా ఉంది. ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా పరిష్కరిస్తాం." అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం స్కూల్ స్టోర్ ఇన్‌ఛార్జ్ గా సిమాంచల్ నహక్ ఉన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు విధించే విషయం పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ను సంప్రదించినట్లు అధికారులు తెలిపారు.

ఆహారం తయారీలో భద్రతా ఉల్లంఘనలు:

వంట సామాగ్రి: దోసెలు తయారు చేసే వస్తువుల విషయంలో అనుమానాలను వ్యక్తం చేశారు. అలాంటి వస్తువులను శుభ్రం చేయడం కష్టం.

భద్రతా ప్రమాదాలు: నూనె వేయించే ప్రాంతంలో కాలు పెడితే జారిపోతున్నట్లు అనిపిస్తోంది.

ఆహార పదార్థాలు: వంటగదిలో వ్రాపింగ్ మెటీరియల్ విషయంలో కూడా నాణ్యత లేదు.

వంట నూనె: ముదురు రంగు నూనె ఉన్నట్లు గుర్తించారు. చాలా సార్లు అదే వంట నూనెను వాడినట్లు తెలుస్తోంది.


ముడి ఆహార పదార్థాలు, వండిన ఆహారాన్ని వేరుగా ఉంచలేదు.

వంటగది దగ్గర.. చుట్టుపక్కల భద్రతా ఉల్లంఘనలు:

నిలిచిన నీరు: వంటగది ఫ్లోర్ అంచులు సరిగా శుభ్రం చేయలేదు. దీంతో ఫ్లోర్ మీద నీరు నిలిచిపోయినట్లు ఇన్‌స్పెక్టర్లు గుర్తించారు.


పరికరాలను సరిగా ఉపయోగించడం లేదు: తయారీదారుల సూచనల ప్రకారం వంటగదిలోని వస్తువులను వాడడం లేదు.


పర్యవేక్షణ కోసం ఉపయోగించే పరికరాల కొరత: ఆహారాన్ని కొలిచే, పర్యవేక్షించే పరికరాలు లేవు.

నిల్వ ఉంచడంలో తప్పిదాలు: వంటగది, క్యాంటీన్ ప్రాంతాలలో మూతలు లేని డస్ట్‌బిన్‌లు ఉన్నాయి. చిమ్నీలు శుభ్రం చేయకపోవడంతో ఎంతో జిడ్డుగా ఉన్నాయి.

వాడిన బట్టలు: పిల్లలకు ఉపయోగించే వస్తువులపై కార్మికుల బట్టలు ఆరబెట్టడం కనిపించింది.

ఆహార నిల్వ: కోల్డ్ స్టోరేజీలో ఇడ్లీ పిండి, పాయసానికి సంబంధించి సరైన తేదీ లేబుల్‌లు లేవు. కోసిన కూరగాయలు, వివిధ పొడి ఆహార పదార్థాలు మూతలు లేకుండా నిల్వ చేశారు.

గడువు ముగిసిన ఉత్పత్తులు: రాజశ్రీ వడపావ్ కు సంబంధించి గడువు ముగిసిన ప్యాకెట్ ను కనుగొన్నారు. అక్టోబర్ 2022లో ప్యాక్ చేయగా.. జూన్ 2023లో గడువు ముగిసింది.

ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పాఠశాలలో ఆహారాన్ని నిల్వ ఉంచే సమయంలోనూ, తయారు చేయడానికి అవసరమైన వివిధ ప్రోటోకాల్‌లకు సంబంధించి సరైన డాక్యుమెంటేషన్ లేదని గుర్తించారు.

చెక్‌లిస్ట్ లేకపోవడం: క్రమం తప్పకుండా శుభ్రపరచడం, వేయించడానికి ఉపయోగించే నూనెను మార్చినట్లు చూపించే ఎలాంటి రికార్డులను పాఠశాల దగ్గర లేదు.

కార్మికుల ఆరోగ్య పరిస్థితులు: ఆహారాన్ని వండే కార్మికుల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన వైద్య ధృవీకరణ పత్రాలు ఏవీ ఇన్‌స్పెక్టర్‌లు కనుగొనలేదు.

ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్ లేరు: దాదాపు 45 మంది కార్మికులు ఆహారాన్ని వండడం, సర్వ్ చేయడం వంటివి చేస్తున్నా.. ఈ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సూపర్‌వైజర్ లేరు.

పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళనలు:

శాంటామారియా స్కూల్‌లో దిగజారుతున్న ఆహార భద్రతా ప్రమాణాలపై చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పిల్లలు పలు విషయాలలో ఫిర్యాదులు చేసినట్లు కూడా తల్లిదండ్రులు చెప్పారు. కడుపునొప్పి, ఉడకని ఆహారం గురించి తరచుగా ఫిర్యాదులు చేస్తూ వచ్చారని.. పిల్లల ఆరోగ్యంపై రాజీ పడటం కుదరదని అన్నారు. తల్లిదండ్రులు పాఠశాల భోజనంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సు కోసం ఇంటి నుండి భోజనం పంపడానికి సిద్ధమవుతూ ఉన్నారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 2011లోని నిబంధనల ప్రకారం, ఇన్‌స్పెక్టర్లు రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, వంటనూనె, ఇతర వస్తువులను శాంటా మారియా వంటగది నుండి సేకరించారు. నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకోనున్నారు.

Next Story