జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 6 July 2024 3:30 PM GMTజీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మేయర్ విజయలక్ష్మి మెజారిటీని నిరూపించుకోవాలని లేదా మేయర్ పదవికి మెజారిటీ లేనందున రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను ముట్టడించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో నగరాభివృద్ధిపై ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. రెండు గ్రూపులు ఒకరినొకరు కొట్టుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. చైర్మన్ హెచ్చరించినా పట్టించుకోకుండా కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్లు తమ కాలనీల్లో రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ కార్పొరేటర్లకు పలుమార్పు విజ్ఞప్తి చేసినా ఫలించలేదు. పరిస్థితి అదుపు తప్పడంతో మేయర్ వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డికి ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కోరారు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరవ్వలేనని అశోక్ రెడ్డి చెప్పారు. దీంతో గొడవలను కట్టడి చేయడానికి జీహెచ్‌ఎంసీ మేయర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అని మేయర్ మండిపడ్డారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు ఆపకపోతే సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.