రూ. 1.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత
Rs 1.17 crore worth of gold seized. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారంతో పాటు విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 July 2023 2:47 PM GMTశంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారంతో పాటు విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. మూడు వేర్వేరు కేసుల్లో విదేశీ సిగరెట్లతో పాటు అక్రమ బంగారాన్ని తరలిస్తున్న నలుగురు నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ ఎయిర్ పోర్ట్ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎయిర్ పోర్టులో అధికారులు ఇచ్చిన ట్విస్ట్ తో స్మగ్లర్లు కటకటాల పాలు అయ్యారు.
మొదటి కేసులో దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడు అధికారులకు తనమీద ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే ఈ ప్రయాణికుడు.. ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న సిబ్బందితో కలిసి అక్రమంగా బంగారాన్ని ఎయిర్ పోర్టు దాటించేందుకు పథకం వేశాడు. పథకం ప్రకారం ప్రయాణికుడు ఎయిర్ పోర్టు లోకి ఎంటర్ కావడంతో లగేజ్ బ్యాగ్ లో అడుగుభాగాన దాచిపెట్టిన 1,399 గ్రాముల బంగారాన్ని ఎయిర్ పోర్టు స్టాఫ్ కి అప్పగించాడు. కానీ కస్టమ్స్ అధికారుల ఎంటర్ అయ్యి ఇచ్చిన ట్విస్ట్ తో ఎయిర్ పోర్టు స్టాఫ్ తో పాటు ప్రయాణికుడు అడ్డంగా దొరికిపోయాడు.
రెండో కేసులో జెడ్డా నుండి హైదరాబాదుకు వచ్చిన ఓ ప్రయాణికుడు 526 గ్రాముల బంగారాన్ని అక్రమంగా ఎయిర్ పోర్టు దాటించేందుకు ప్రయత్నించాడు. కానీ అధికారులకు అనుమానం రావడంతో అధికారులు అతని బ్యాగులను క్షుణ్ణంగా స్కానింగ్ చేయడంతో అక్రమ బంగారం వ్యవహారం కాస్త బయటపడడంతో అతను అడ్డంగా బుక్కయ్యాడు. మొత్తం రెండు కేసుల్లో 1.93 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 1.17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా మూడవ కేసులో ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వస్తుండగా విదేశీ సిగరెట్లు ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం చేశాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో వెంటనే అతన్ని క్షుణ్ణంగా స్కానింగ్ చేయగా విదేశీ సిగరెట్ల వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. దీంతో వెంటనే అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 62,400 విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు కేసుల్లో విదేశీ సిగరెట్లతో పాటు అక్రమ బంగారం తరలిస్తున్న మొత్తం నలుగురు నిందితులను అధికారులు అరెస్టు చేసి విచారణ కొనసాగించారు.