రోహిత్ వేముల కేసును మళ్లీ దర్యాప్తు చేస్తాం

సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి డీజీపీ రవిగుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  4 May 2024 9:06 AM IST
రోహిత్ వేముల కేసును మళ్లీ దర్యాప్తు చేస్తాం

సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి డీజీపీ రవిగుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా తెలిపారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి రకరకాల కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ.. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా మాదాపూర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉన్నారని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికనవంబర్‌ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. విచారణ జరిగిన విధానంపై రోహిత్‌ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని రవి గుప్తా వివరించారు. తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజిస్ట్రేట్ ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన అన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతి కేసును సైబరాబాద్ పోలీసులు క్లోజ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలుపుతూ.. తుది నివేదికను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు నుంచి హెచ్‌సీయూ మాజీ వైస్‌ఛాన్స్‌లర్‌ అప్పారావును తప్పించారు. రోహిత్‌ ఎస్సీ కాదని హైకోర్టుకు రిపోర్ట్‌ సమర్పించారు. తనది ఫేక్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ అని తేలితే సాధించిన డిగ్రీలు కోల్పోవడంతో పాటు శిక్ష పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు.

Next Story