రోడ్డు ప్ర‌మాదం కాదు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపేశాడు..!

Road Accident took place in Bachupally Police Station Area. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

By Medi Samrat  Published on  6 Aug 2023 5:37 PM IST
రోడ్డు ప్ర‌మాదం కాదు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపేశాడు..!

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై పక్కనే ఉన్న యువతి బాయ్ ఫ్రెండ్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివ‌రాళ్లోకెళితే.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్ళి చేసుకోమని అడిగినందుకు యువ‌కుడు యువ‌తిని వేగంగా వ‌స్తున్న‌ ట్యాంకర్ కిందకు తోసేశాడ‌ని పోలీసులు చెబుతున్నారు.

సీఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రమీలా(21)అనే యువతి గత మూడు సంవత్సరాల నుండి బోరంపేట్ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటుంది. బాచుపల్లిలోని ప్రెస్టేజ్ షోరూమ్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. కొండాపూర్ లో నివాసం ఉండే తిరుపతి (27), ప్రమీల ఇద్దరూ ఆరు నెలల నుండి ప్రేమించుకుంటున్నారు. ఇటీవ‌ల‌ ప్రమీల పెళ్ళి చేసుకోవాల్సిందిగా తిరుపతిని వత్తిడి చేస్తుంది.

దీంతో ఆదివారం ఉదయం పెళ్ళి విషయం మాట్లాడుదామని తిరుపతి బాచుపల్లికి రమ్మని చెప్పడంతో ప్రమీల అక్కడకు చేరుకుంది. అక్కడ ఇద్ద‌రి మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. అప్పుడే ప్రగతినగర్ నుండి వస్తున్న వాటర్ ట్యాంకర్ ను గమనించిన తిరుపతి.. ప్రమీలను ట్యాంకర్ మీద‌కు నెట్ట‌డంతో.. ట్యాంకర్‌కు త‌గిలి కింద‌ప‌డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందకున్న బాచుపల్లి పోలీసులు.. ఘటనా స్థ‌లానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి పరారీలో ఉన్నట్లు సీఐ సుమన్ తెలిపారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story