జూబ్లీహిల్స్‌లో కారు బీభ‌త్సం.. చిన్నారి మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్క‌ర్‌

Road Accident in Jubilee hills Child dead.హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ కారు బీభ‌త్సం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 8:36 AM IST
జూబ్లీహిల్స్‌లో కారు బీభ‌త్సం.. చిన్నారి మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్క‌ర్‌

హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో రెండున్న నెల‌ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మ‌రో చిన్నారి, ఇద్ద‌రు మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 1 వైపు వెళ్తున్న కారు గురువారం రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లోని బ్రిడ్జిని దాటి రోడ్డు నంబరు 1/45 చౌరస్తా వైపు వేగంగా దూసుకొచ్చింది. మ‌హారాష్ట్ర ప్రాంతానికి చెందిన కాజల్ చౌహన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలు పిల్ల‌ల‌ను ఎత్తుకుని బెలూన్ల‌ను విక్ర‌యిస్తుండ‌గా.. వారిని కారు ఢీ కొట్టింది.

కారు ఢీ కొట్ట‌డంతో కాజ‌ల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండున్న‌ర నెల‌ల చిన్నారి ర‌ణ‌వీర్ చౌహాన్‌, సారిక చౌహాన్ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్ కింద‌ప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు సైతం గాయాల‌య్యాయి. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అయితే.. చిన్నారి ర‌ణ‌వీర్ చౌహాన్ మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. గాయాలపాలైన మరో చిన్నారి, మహిళలకు చికిత్స అందిస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి ప్ర‌మాదం అనంత‌రం కారును అక్క‌డే వ‌దిలివేసి ప‌రార‌య్యాడు. కారుపై బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ అమీర్ మ‌హ‌మ్మ‌ద్ పేరుతో స్టిక్క‌ర్ ఉంది. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story