తండ్రీ కొడుకులు ప్రజల ప్రాణాలు పూచీక పుల్లతో సమానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్‌లో ముప్పు ప్రాంతాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయిందని.. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు బాత్రూమ్‌లు కడగడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారని ఆరోపించారు.
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 30 మంది చనిపోయినా కేసీఆర్ ఎందుకు పరామర్శించేందుకు రాలేదని ప్రశ్నించారు. వరద బాధితులను ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు.. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందని.. అందుకే ఈ ప్రభుత్వానికి వరద నీటిలో తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్ కు బుద్ది రాలేదన్నారు. సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలన్నారు. లేకపోతే సోమవారం పార్లమెంటులో నితిన్ గడ్కరీకి నివేదిస్తామని హెచ్చరించారు.
కేంద్రం తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు వెయ్యి కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజీపీ కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. కిషన్ రెడ్డి ప్రధానిని కలిసి వెంటనే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.