దమ్ముంటే ఓల్డ్ సిటీలో కూల్చివేతలు చేపట్టండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్

అక్రమ నిర్మాణాల కూల్చివేతలు హైదరాబాద్ లోని పాతబస్తీ నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ నేత‌, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  23 Jan 2025 5:00 PM IST
దమ్ముంటే ఓల్డ్ సిటీలో కూల్చివేతలు చేపట్టండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్

అక్రమ నిర్మాణాల కూల్చివేతలు హైదరాబాద్ లోని పాతబస్తీ నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ నేత‌, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. జనవరి 23, గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు ఇటీవల చింతల్ బస్తీలో కూల్చివేతలకు దిగారని, దమ్ముంటే పాతబస్తీలోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సవాల్ విసిరారు. ఖైరతాబాద్, చింతల్ బస్తీలోని వీధి వ్యాపారుల ఇళ్లను జీహెచ్‌ఎంసీ కూల్చివేయడం అన్యాయమన్నారు. ఈ కూల్చివేతలు పేదల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని ఆయన అన్నారు. రోజూ వారి వ్యాపారాలు చేసుకునే వారిపై అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రోజు వారీ వ్యాపారం చేసుకునే వారికి, వాళ్లు చేసుకుంటేనే వారి జీవనం గడుస్తుందని, అలాంటి వారిని ఇబ్బంది పెడితే వారి శాపనార్థాలు మంచిది కాదన్నారు దానం నాగేందర్.

అధికారుల చర్యలను ప్రశ్నిస్తూనే నాలాంటి ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి వెళ్లడం కూడా కష్టంగా మారిందని విలేకరులతో దానం నాగేందర్ అన్నారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. అధికారులకు స్వేచ్ఛనిస్తే అది ప్రభుత్వ అస్తిత్వానికే ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు.

Next Story