ఓవైసీ బ్రదర్స్ పై ఫైర్ అయిన రాజా సింగ్

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  25 Sept 2023 5:30 PM IST
ఓవైసీ బ్రదర్స్ పై ఫైర్ అయిన రాజా సింగ్

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక అడవి పాము అని, ఆ అడవి పామును పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ బ్రదర్స్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే వ్యక్తులని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఓవైసీ ఎదిగాడనే విషయాన్ని ఆయన మరిచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఓవైసీకి దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్ సవాల్ చేశారు. ఆయనకు చేతకాకుంటే చిన్న తమ్ముడిని పంపించాలని, ఆయనకు కూడా దమ్ము లేకుంటే ఇంకెవరినైనా పంపించాలన్నారు.

మహిళా బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్‌లో ఒక మాట.. బయటొక మాట మాట్లాడుతున్నారన్నారు రాజా సింగ్. ఎంఐఎంలో ఎంతమంది మహిళలున్నారని, ఎంతమందికి సీట్లు కేటాయించి మహిళలకు విలువనిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం నుంచి మహిళలను నిలబెట్టే దమ్ము లేదా అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించలేని ఒవైసీకి మహిళల బిల్లుపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఓవైసీ, ఓవైసీ ముత్తాతలు ఏనాడైనా ముస్లింలకు మంచి చేశారా అని రాజాసింగ్ ప్రశ్నించారు. ముస్లిం ప్రజలను మోసం చేసింది ఎంఐఎం, ఓవైసీ, ఓవైసీ ముత్తాతలేనని ఆరోపించారు. ఓల్డ్ సిటీ ప్రజలను సర్వనాశనం చేశారని.. ముస్లింల ఓట్లను ఓవైసీ బ్రదర్స్ అమ్ముకుంటున్నారని రాజా సింగ్ ఆరోపించారు.

Next Story