కొనసాగుతున్న దాడులు.. రెస్టారెంట్ల తీరు మారేనా?
హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్‌లపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 25 May 2024 7:29 AM GMTహైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్‌లపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో శుక్రవారం, మే 24 తనిఖీలు నిర్వహించారు. అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తిస్తున్నారు. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఆయా ఫుడ్ జాయింట్స్ లో నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనే విషయమై అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
'చిచాస్ అస్లీ హైదరాబాదీ ఖానా' మాసబ్ ట్యాంక్ వద్ద ఉంటుంది. ఈ వంటగదిలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కనుగొన్నారు. రాష్ట్ర లైసెన్స్‌కు బదులుగా రిజిస్ట్రేషన్‌తో అవుట్ లెట్ ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెజ్- నాన్ వెజ్, పచ్చి- పాక్షికంగా తయారుచేసిన ఆహారాన్ని సరైన లేబుల్‌లు, కవర్ లేకుండా ఒకదానితో ఒకటి నిల్వ ఉంచారు. కీటకాలు ప్రవేశించకుండా ఉండటానికి వంటగది కిటికీలకు సరైన మెష్ లేదా అడ్డంకి లేదు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవని కూడా గుర్తించారు.
ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. అందులో ధార బ్రాండ్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు దొరికాయని, అక్కడికక్కడే పరీక్షించగా టిడిఎస్ లెవల్స్ 73 పిపిఎమ్‌లుగా ఉన్నాయని డిపార్ట్‌మెంట్ తెలిపింది. మిగిలిన నీటి సీసాల నమూనాలను విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారని అధికారులు తెలిపారు.