మీరూ ఆ హోటల్స్ లో తిన్నారేమో.. గుర్తు తెచ్చుకోండి..!

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్ హైదరాబాద్‌లోని మండి, మల్టీక్యూసిన్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించింది

By Medi Samrat  Published on  23 Aug 2024 2:33 PM IST
మీరూ ఆ హోటల్స్ లో తిన్నారేమో.. గుర్తు తెచ్చుకోండి..!

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్ హైదరాబాద్‌లోని మండి, మల్టీక్యూసిన్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడులలో సేప్టీ ఉల్లంఘనలు కనుగొన్నారు. అరమ్‌గఢ్‌లో ఉన్న గోల్డెన్ పియర్స్, మల్టీక్యూసిన్ రెస్టారెంట్‌లో, ఫుడ్ సేఫ్టీ టీమ్ కు కిచెన్ ఆవరణలో ఈగలు కనిపించాయి. రెస్టారెంట్ లోపల పచ్చి మటన్ ముక్కలు పడేసి ఉండడాన్ని కూడా గమనించారు. FBO (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్) వద్ద పెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు, ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా అందుబాటులో లేవు. కొందరు ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్‌క్యాప్‌లు, అప్రాన్‌లు లేకుండా కనిపించారు.

హైదరాబాద్‌లోని మండి రెస్టారెంట్లలో ఒకటైన దార్ అల్ మండి పై జరిగిన దాడిలో.. కిచెన్ ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉందని, డ్రెయిన్ నీరు నిలిచిపోయిందని గుర్తించారు. కిచెన్ ఆవరణలో ఎటువంటి అడ్డుగోడలు లేకుండా బయటి వాతావరణానికి తెరిచి ఉంచారు. పురుగులు ప్రవేశించకుండా నిరోధించడానికి తలుపులు కూడా సరిగ్గా అమర్చలేదు. అధికారులు హైదరాబాద్‌లోని రెస్టారెంట్లపై దాడులతో పాటు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలలు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో వంటగది సిబ్బందికి సరైన ప్రోటోకాల్‌, ఆహార తయారీకి సంబంధించిన ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.

Next Story