రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఇకపై హైదరాబాద్‌లో..
రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు.
By Medi Samrat
రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన విడిభాగాలను హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తారు. రఫేల్ విమాన భాగాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ భారత్‌లో మా కార్యకలాపాలను మరింత విస్తరించడంలో ఇది ఒక నిర్ణయాత్మక ముందడుగని అన్నారు. భారత రక్షణ రంగానికి మా సేవలను అందించే అవకాశాన్ని మరింతగా పెంచుతున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. భారత రక్షణ రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని, డసో ఏవియేషన్‌తో కుదిరిన ఈ ఒప్పందం, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి తెలియజేస్తుందని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) సీఎండీ సుకరన్ సింగ్ తెలిపారు.