పుష్ప-2 ప్రీమియర్స్ తొక్కిసలాట ఘటన.. ముగ్గురి అరెస్టు

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మహిళ మరణించిన కేసులో సంధ్య సినిమా థియేటర్ యజమాని, మేనేజర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.

By అంజి  Published on  9 Dec 2024 9:28 AM IST
Pushpa-2 premiers, stampede, arrest, Tollywood, Allu arjun

పుష్ప-2 ప్రీమియర్స్ తొక్కిసలాట ఘటన.. ముగ్గురి అరెస్టు

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మహిళ మరణించిన కేసులో సంధ్య సినిమా థియేటర్ యజమాని, మేనేజర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. డిసెంబర్ 4న చిక్కడపల్లిలోని సంధ్యా థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించింది. ఆమె 13 ఏళ్ల కుమారుడు శ్రీ తేజ్ ఆసుపత్రి పాలయ్యాడు.

పోలీసు అధికారులు కుటుంబాన్ని రక్షించగలిగారు, శ్రీ తేజ్‌కు CPR చేసి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. విషాదకరంగా, రేవతి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుమారుడిని తదుపరి చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించారు.

మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 105 మరియు 118(1) కింద అల్లు అర్జున్, అతని భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు.

థియేటర్ యజమాని, సీనియర్ మేనేజర్, దిగువ బాల్కనీ ఇన్‌చార్జి సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా చూసేందుకు, థియేటర్‌కి వస్తున్న సినిమాలోని నటీనటులను చూసేందుకు భారీగా జనాలు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే, వారు థియేటర్‌కి వస్తారని థియేటర్ యాజమాన్యం లేదా నటీనటుల బృందం నుండి ఎటువంటి సమాచారం లేదు. "థియేటర్ మేనేజ్‌మెంట్ ప్రేక్షకులను అడ్డుకోడానికి, భద్రతకు సంబంధించి ఎటువంటి అదనపు చర్యలను తీసుకోలేదు లేదా నటీనటుల బృందానికి వారి రాక గురించి సమాచారం ఉన్నప్పటికీ వచ్చిపోడానికి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదు" అని పోలీసులు తెలిపారు.

డిసెంబరు 4వ తేదీ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ తన వ్యక్తిగత భద్రతతో థియేటర్‌కి రావడంతో అక్కడ గుమిగూడిన అభిమానులు ఆయనతో పాటు థియేటర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

"అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా బృందం ప్రజలను నెట్టడం ప్రారంభించింది, ఇప్పటికే థియేటర్ వద్ద భారీగా గుంపు ఉండటంతో పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ సమయంలోనే నటుడు, అతని భద్రతా బృందంతో పాటు, పెద్ద సంఖ్యలో ప్రజలు దిగువ బాల్కనీ ప్రాంతం లోకి ప్రవేశించారు." అని తెలిపారు. రేవతి, ఆమె కుమారుడు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో కిందపడిపోయారు. వెంటనే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వారిని దిగువ బాల్కనీ నుండి బయటకు లాగి, ఆమె కుమారుడికి కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ మహిళ చనిపోయిందని డాక్టర్లు తెలియజేశారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story