మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారుల‌కు డీజీపీ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు

By Medi Samrat
Published on : 2 May 2025 8:34 PM IST

మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారుల‌కు డీజీపీ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డిజిపి కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పోలీస్ అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత చేపట్టాలనీ తెలిపారన్నారు. దాదాపు 120 దేశాల నుండి కంటెస్టెంట్లు రానున్నారని ఇప్పటివరకు 116 దేశాల కంటెస్టెంట్లు సమాచారం వచ్చిందన్నారు. దాదాపు నెలరోజుల పాటు వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా పర్యటిస్తారని డిజిపి అన్నారు. అతిథులు రాక శుక్రవారం నుండి మొదలైందని మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమం ఈనెల 10వ తేదీన జరగనుందని డిజిపి తెలిపారు.

మిస్ వరల్డ్ షెడ్యూల్ లో భాగంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి దేవాలయం, వరంగల్ జిల్లాల్లోనూ , హైదరాబాదులోని లాల్ బజార్, సెక్రటేరియట్ , రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట దేవాలయం, ఉప్పల్ స్టేడియం, పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ, తదితర ప్రాంతాలను గ్రూపుల వారీగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటిస్తారని తెలియజేశారు. ఆయా ప్రాంతాలను, కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. భారీ స్థాయిలో జరగనున్న ఈ పోటీలకు ప్రారంభ వేదికను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తుండగా ఫైనల్ పోటీలను ఈనెల 31వ తేదీన హైటెక్స్ లో నిర్వహించనున్నామన్నారు. భారతదేశంలోనే పోలీస్ పెర్ఫామెన్స్ లో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీస్ శాఖ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుండి వచ్చే కంటెస్టెంట్లకు , అతిధులకు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టి సమర్ధతను ప్రపంచంలో ఇతర దేశాలకు చాటి చెప్పాలని డిజిపి ఆకాంక్షించారు.

ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును కంటెస్టెంట్ లో కొందరు సందర్శిస్తారని, ఈనెల 13వ తేదీన లాల్ బజార్ , చౌమల్లా ప్యాలెస్ లను,మరికొందరు ఈనెల 14వ తేదీన వరంగల్ హెరిటేజ్ సందర్శన, రామప్ప ఆలయ సందర్శన, ఈనెల 15వ తేదీన యాదగిరి గుట్ట ఆలయ సందర్శన, అదే రోజున మరికొందరు పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారనీ.. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లోనిఏఐజి హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు హాజరవుతారని, అదే రోజున మరికొందరు పిల్లల మర్రి వృక్ష సందర్శన చేస్తారని, ఎకో పార్క్ సందర్శిస్తారని, ఈనెల 17వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే స్పోర్ట్స్ ఫైనల్ పోటీలలో పాల్గొంటారని, అదే రోజున మరికొందరు కంటెస్టెంట్లు

రామోజీ ఫిలిం సిటీ సందర్శిస్తారని ఈనెల 18వ తేదీన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారని, అదే రోజున మరికొందరు కంటెస్టెంట్లు సచివాలయం పరిశీలిస్తారని, ఈనెల 20 తేదీన ఉప్పల్ స్టేడియంలో 21వ తేదీన శిల్పారామం లను సందర్శిస్తారని ఈనెల 31వ తేదీన మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరుగుతాయని డిజిపి అన్నారు.

శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ , అడిషనల్ డీజీపీ, మిస్ వరల్డ్ పోటీలకు పోలీస్ నోడల్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐ జి పి కార్తికేయ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, మల్టీ జోన్ల ఐ జి పి లు చంద్రశేఖర్ రెడ్డి, వి సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ కమిషనర్, ములుగు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఎస్పీలతో డిజిపి డాక్టర్ జితేందర్ మాట్లాడారు.

Next Story