హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుంకర నరేష్ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం కుషాయిగూడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కు సుంకర నరేష్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో.. అమరవీరుల త్యాగాలతో నిర్మితమైన తెలంగాణకు మణిహారంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మంట కలుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైనిక అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొంటామని పేర్కొన్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.