ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్‌

ప్రవళిక ఆత్మహత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ప్రవళిక(23) అనే యువతి

By Medi Samrat  Published on  14 Oct 2023 6:30 PM IST
ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్‌

ప్రవళిక ఆత్మహత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ప్రవళిక(23) అనే యువతి నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఫ్యానుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లాలోని బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక గ్రూప్స్ కోచింగ్ కోసం అశోక్ నగర్ లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో 15 రోజుల క్రితం జాయిన్ అయింది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు తెలిపారు. ఆమెకు హాస్టల్లో శృతి, సంధ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిని మేము విచారించామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

నిన్న రాత్రి సమయంలో ప్రవళిక ఒక్కతే రూమ్ లో ఉన్నప్పుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రవళిక ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన తల్లికి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మొబైల్ ఫోన్ చూస్తే అందులో ఒక చాటింగ్ ను గమనించామని డీసీపీ తెలిపారు. శివరాం రాథోడ్ అనే అబ్బాయితో ప్రవళిక ప్రైవేట్ చాటింగ్ చేసిందని గుర్తించాం.. శివరాం రాథోడ్ ప్రవళిక గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. నిన్న ఉదయం బాలాజీ దర్శన్ హోటల్లో ఈ ఇద్దరు టిఫిన్ చేశారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో మేము పరిశీలించామని డీసీపీ తెలిపారు.

అనంతరం ప్రవళిక ఫోన్ లో వాట్స్అప్ చాటింగ్ గమనించాం. ప్రవళిక ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన స్నేహితులతో శివరాం మరో పెళ్లి చేసుకోబోతున్నాడని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ చాటింగ్ చేసింది. శివరాం మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆ చాటింగ్ ద్వారా మేము తెలుసుకున్నాం. తనను ప్రియుడు మోసం చేశాడని ప్రవళిక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించాము. ప్రవళిక ప్రేమ వ్యవహారం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. గతంలో వారు మందలించారు కూడా.. ప్రవళిక సూసైడ్ లెటర్, వాట్సప్ చాటింగ్ ఫోరెన్సిక్ లాబ్ కి పంపించామని తెలిపారు. శివరాం రాథోడ్, ప్రవళిక వాట్సప్ చాటింగ్, ఫోటోలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగించామని డీసీపీ పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అనంతరం ప్రియుడు శివరాం పై కేసు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు.

అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, విద్యార్థి సంఘాల‌ నాయకులు విషయం తప్పుతోవ పట్టించడానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడం వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందంటూ ధర్నా చేస్తూ పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Next Story