హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కి లారీలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు.. అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ అధికారులు గుర్తించారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ.3.71కోట్ల నగదు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సైకోట్రోఫిక్ జౌషదాలను సరఫరా చేస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఆశిష్ జైన్ గత రెండేళ్లలో వెయ్యి సార్లకు పైగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.