MMTS అత్యాచారయత్నం ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 ఏళ్ల యువతి నిందితుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి నడుస్తున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని మేడ్చల్ జిల్లా గొడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేష్‌గా గుర్తించారు. రైల్వే పోలీసు అధికారులు బాధిత యువతికి అనుమానితుడి ఫోటోను చూపించగా.. ఆమె అతన్ని ఖచ్చితంగా గుర్తించలేకపోయినట్లు సమాచారం. వివరాలు రాబట్టేందుకు పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడికి గతంలో నేర నేపథ్యం ఉన్నట్లు తెలుస్తుంది. అతడు గంజాయికి బానిస అయినట్లు తెలుస్తుంది. భార్య నుంచి విడిపోయి గ్రామంలో ఒంటరిగా ఉంటున్నట్లు గుర్తించారు.
బాధితురాలు తన మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ఆదివారం సికింద్రాబాద్ వచ్చింది. ఫోన్ రిపేర్ తర్వాత ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. జనరల్ టికెట్ తీసుకుని తెల్పూర్-మేడ్చల్ ఎంఎంటీస్ రైలు ఎక్కి మహిళల కోసం రిజర్వ్ చేసిన కోచ్‌లో కూర్చుంది. ఆమెతో పాటు అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అల్వాల్ రైల్వే స్టేషన్‌లో దిగారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె కోచ్‌లో ఒంటరిగా ఉండగా.. ఓ యువకుడు ఆమె దగ్గరకు వచ్చి లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలో లైంగిక దాడి నుండి తప్పించుకోవడానికి నడుస్తున్న రైలు నుంచి దూకింది. బాధితురాలి తల, గవద, కుడి చేయి, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో మహిళ గాయపడి పడి ఉంది. బాటసారులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమెను సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య 28 కిలోమీటర్ల మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేశారు.