హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట ఎయిర్ పోర్టులో దిగారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు ప్రధానికి స్వాగతం పలికారు.
ఆ తర్వాత నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ పటిష్ఠం చేశారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రయాణించే ఈ రైల్లో మొత్తం 530 మంది ప్రయాణికులకు సరిపడా సీట్లు ఉంటాయి. సికింద్రాబాద్‌లో ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ లో విద్యార్థులతో మోదీ కాసేపు సంభాషించారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.