హైదరాబాద్ పాలిటిక్స్‌లో హీట్..15 రోజుల్లో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో మరోమారు ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తన వ్యూహాలకు పదును పెడుతోంది.
By - Knakam Karthik |
హైదరాబాద్ పాలిటిక్స్‌లో హీట్..15 రోజుల్లో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో మరోమారు ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తన వ్యూహాలకు పదును పెడుతోంది. రానున్న 10-15 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ప్రారంభోత్సవం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ద్వారా ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరిక పంపాలని బీజేపీ భావిస్తోంది.
మూడు ముక్కల 'గ్రేటర్'.. బీజేపీకి సవాల్, కాంగ్రెస్‌కు వ్యూహం?
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరుతో జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా (GHMC, CMC, MMC) విభజించడం వెనుక రాజకీయ కోణం ఉందని బీజేపీ బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా ఎంఐఎం సలహాతో, బీజేపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకే కాంగ్రెస్ ఈ విభజన కార్యం చేపట్టిందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. 300 డివిజన్లకు విస్తరించిన ఈ కొత్త వ్యవస్థలో పాగా వేయడం ద్వారా తెలంగాణలో తమ పట్టును నిరూపించుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి 10తో పాత పాలకమండలి గడువు ముగియడంతో, ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికలే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారాయి.
మోదీ అస్త్రంతో పట్టణ ఓటర్లకు గాలం
హైదరాబాద్‌లోని పట్టణ ఓటర్లు ఎప్పుడూ బీజేపీకి అండగా ఉంటారనే నమ్మకం ఆ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ద్వారా ఆ నమ్మకాన్ని ఓట్లుగా మలచుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC): ఐటీ కారిడార్‌పై పట్టు కోసం. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC): మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు. జీహెచ్‌ఎంసీ (GHMC): పాతబస్తీ సహా కోర్ సిటీలో ఎంఐఎం, కాంగ్రెస్ వ్యూహాలను చిత్తు చేసేందుకు.
మొత్తానికి, అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. రాజకీయంగా గ్రేటర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. కాంగ్రెస్, ఎంఐఎంల పొత్తును ఎండగడుతూ, పట్టణ ప్రాంత అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.