బోరబండలో మీటింగ్‌కు అనుమతి రద్దు..ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్న బండి సంజయ్
కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.
By - Knakam Karthik |
బోరబండలో మీటింగ్‌కు అనుమతి రద్దు..ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్న బండి సంజయ్
హైదరాబాద్‌లోని బోరబండలో ఈరోజు జరగాల్సిన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. తొలుత సభకు అంగీకారం తెలిపి, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామంతో బోరబండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ విషయంపై బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒకసారి అనుమతి మంజూరు చేశాక, మళ్లీ రద్దు చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
కాగా మీటింగ్‌కు అనుమతి రద్దుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బోరబండకు నేనొస్తున్నా..ఎవరు అడ్డుకుంటారో చూస్తా. ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడింది. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా.... సాయంత్రం బోరబండకు తరలిరండి, బీజేపీ దమ్మేందో చూపిద్దాం..ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేంది? రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? బోరబండలో బీజేపీ తడాఖా ఏందో చూపిస్తాం.. బీజేపీ శ్రేణులారా....బోరబండకు భారీగా తరలిరండి. మజ్లిస్ సంగతేందో, పోలీసుల సంగతేందో తేల్చుకుందాం.. బండి సంజయ్ అని పేర్కొన్నారు.