దానం నాగేందర్‌తో న్యూస్‌మీటర్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ: కాంగ్రెస్ గూటికి చేరడానికి గల కారణాలు ఇవేనట!!

బీఆర్ఎస్ ను వదిలిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు.

By అంజి  Published on  7 May 2024 3:00 PM GMT
Danam Nagende, Congress, Hyderabad, Telangana, Secunderabad

దానం నాగేందర్‌తో న్యూస్‌మీటర్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ: కాంగ్రెస్ గూటికి చేరడానికి గల కారణాలు ఇవేనట!! 

హైదరాబాద్: బీఆర్ఎస్ ను వదిలిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ఇది తనకు 'ఘర్ వాపసీ' అని దానం నాగేందర్ అన్నారు. ఇంతకు ముందు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నుండి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి మారారు. 2024 లో తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్ళారు.

దానం నాగేందర్ 2018, 2023లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలుపొందారు. గతంలో 1994, 1999, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఆయన ఆసిఫ్‌నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సీనియర్ నాయకుడు దానం నాగేందర్ తన 30 సంవత్సరాల రాజకీయాల గురించి, సికింద్రాబాద్‌లో ఒకప్పుడు గొప్ప శక్తిగా ఉన్న కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాల్సిన అవసరం గురించి మాట్లాడారు.

ఆయనతో ఇంటర్వ్యూ సాగిందిలా:

న్యూస్ మీటర్ : సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యునిగా మీ అభ్యర్థిత్వం పేరు ప్రకటించినప్పటి నుండి ఎలాంటి పరిణామాలు జరిగాయి. సికింద్రాబాద్ ఎంపీ సీటుపై పోరుకు మీరు వెనుకడుగు వేశారనే ప్రచారం జరిగింది. మీ అభిప్రాయం ఏమిటి?

దానం నాగేందర్: భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ సభ్యులు నన్ను సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎంపిక చేయడం నా అదృష్టం. ఇది నాకు చాలా గొప్ప అవకాశం కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగానే సీటును ఖరారు చేస్తోందని, ప్రతి సర్వేలోనూ నా పేరు ఉందన్నారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ పేరును సర్వేలో ప్రజలు ఎంచుకున్నారు. నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవాలనుకున్నందున తదుపరి దశను ఖరారు చేయడానికి సమయం తీసుకున్నాను. ఇన్నాళ్లు నాకు తెలిసిన లాయర్ల బృందంతో నేను ఆ పని చేశాను. కాంగ్రెస్ పార్టీలో నాకు మార్గదర్శకత్వం వహించిన న్యాయవాదుల బృందం కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఈ సీటు గెలుస్తానని చెప్పాను. సికింద్రాబాద్‌ అర్బన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఉనికి లేదని కొందరు చెబుతున్నారు.. అది తప్పు అని నిరూపించేందుకు నేను సవాల్‌గా తీసుకున్నాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేను 2004లో పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలనుకున్నాను.. ఇప్పుడు నేను 2024లో పోటీ చేస్తున్నాను. ఇది కేవలం నా విధి అని మాత్రమే నేను అనుకుంటున్నాను.

న్యూస్ మీటర్: మీరు BRS నుండి కాంగ్రెస్‌కు మారడం చర్చనీయాంశమైంది. నగరంలోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలపైనా ప్రభావం పడింది. మీరు ఈ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తున్నారు?

దానం నాగేందర్: నిజాయతీగా చెప్పాలంటే గత ఏడేళ్లలో నేను బీఆర్‌ఎస్‌తో సంతోషంగా లేను. నేను ఆ పార్టీలో ఏమి చేస్తున్నాను.. ఈ పార్టీలో నా రాజకీయ భవిష్యత్తు ఏమిటి? నేను BRS లో ఎందుకు చేరాను? ఇక్కడికి వచ్చి నేను ఏమైనా తప్పు చేశానా? అని నన్ను నేను తరచుగా అడుగుతూ ఉండేవాన్ని. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నాను. అయితే ఖైరతాబాద్ నుంచి నా సీటు గెలవాలని, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ని వీడాలని అనుకున్నాను. ఇక్కడి క్యాడర్ నా వెంట ఉంది, వారంతా నా కోసం కష్టపడుతున్నారు. నిజానికి నాకు కాంగ్రెస్‌ లోకి రావడం ‘ఘర్ వాప్సీ’ లాగా ఉంది. నా స్నేహితులు, సహచరులు, క్యాడర్ నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు.

న్యూస్ మీటర్ : మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరాలని అనుకున్నారు సరే? మీరు దేని కోసం ఇన్నాళ్లూ వేచి ఉన్నారు? కారణం ఏమిటి?

దానం నాగేందర్: 2004లో కాంగ్రెస్ పార్టీలోని సమస్యల కారణంగా ఆ పార్టీని వీడాను. ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ రావాలనుకున్నాను. నా ఎన్నికల విజయమే పార్టీకి నా ట్రోఫీ కావాలని కోరుకున్నాను. నేను 2004లో నిస్సంకోచంగా బయటకు వెళ్ళాను. ఖాళీ చేతులతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అనుకోలేదు. ఆ కారణంగానే ఇన్నాళ్లూ నేను వేచి ఉన్నాను. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి పిలుపు రావడం నా అదృష్టం అని భావించాను. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు దానిపైనే నా ప్రధాన దృష్టి ఉంది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలం నుంచి నాతో పాటు పనిచేసిన వారందరినీ మళ్లీ తీసుకొచ్చే అవకాశం సికింద్రాబాద్‌ సీటు కల్పిస్తోంది.

న్యూస్ మీటర్: వివిధ నివేదికల ప్రకారం, బీజేపీ నుండి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు జి.కిషన్ రెడ్డి చాలా బలంగా ఉన్నారని, మీకు గట్టి పోటీ కూడా ఉందని అంటున్నారు. దీని గురించి మీరు ఏమని చెబుతారు?

దానం నాగేందర్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరు. ఇది అందరి నుండి వచ్చిన ఫిర్యాదు. ఆయన ఎవరినీ కలవడం లేదు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండటమే నాయకుడి పని. కిషన్ రెడ్డి విషయంలో అలా జరగలేదు.

న్యూస్ మీటర్: ప్రతి నాయకుడు చెప్పేది-చేసేది ఓటర్లకు బాగా తెలుసు. డిజిటల్ రికార్డులు కూడా ఉంటాయి. మీ గురించి ప్రచారం అవుతున్న పుకార్లు, సమాచారం గురించి మీరు ఓటర్లను ఎలా మీ వైపు తిప్పించుకోబోతున్నారు?

దానం నాగేందర్: పాతికేళ్ల క్రితం ఓటర్లతో పోలిస్తే ఇప్పుడు ఓటర్లకు చాలా అవగాహన ఉందనడంలో సందేహం లేదు. అయితే రాజకీయ పార్టీలు కూడా మారాయి. కొత్త పార్టీ అయిన బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేసింది. వారు నాపై, కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తమలో తాము పోట్లాడుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. వారు అలా ఎందుకు చేస్తారు? ఇది తప్పుడు ప్రచారం. బీఆర్‌ఎస్ వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారం చాలా దురదృష్టకరం. ఈ పద్ధతులు మంచివి కావు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, కేడర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. BRS నాయకుల ఈ చర్చల వెనుక ఉన్న లాజిక్‌ను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. వారికి ఒక్కటే సమాధానం సికింద్రాబాద్ సీటును నేనూ, నా టీమ్ కూడా కష్టపడి గెలవాలి. గెలిచిన తర్వాత ఈ తప్పుడు కథనాలకు, వదంతులకు ఎలాంటి చోటు ఉండదు.

Next Story