తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19 మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో థర్డ్‌వేవ్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఇటీవల మూడు కమిషనరేట్‌ల పరిధిలో దాదాపు 1,000 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 700 మంది కరోనా సోకిన పోలీసులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసుల పరిస్థితి నిలకడగా ఉంది.
ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. కరోనా సోకిన సిబ్బందిలో లక్డికాపూల్‌లోని తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయంలో లేదా మూడు కమిషనరేట్‌లలో కీలక పదవులను కలిగి ఉన్న కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సమయంలోనూ పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్ బారిన పడ్డారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో, పోలీసులు కూడా ఫ్రంట్‌లైన్ కార్మికులు కావడంతో వారికి ప్రాధాన్యతపై బూస్టర్ డోస్ ఇస్తున్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో 2,983 కొత్త కోవిడ్-19 కేసులు, ఇద్దరు మరణాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్లలో చాలా మంది పోలీసులు కూడా కరోనా పాజిటివ్‌ను పరీక్షించారు. పోలీసు స్టేషన్లలో పోలీసులతో మాట్లాడటానికి/ఫిర్యాదు చేయడానికి ఒక వ్యక్తిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఫిర్యాదుదారుడితో పాటు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను లోపలికి అనుమతించడం లేదు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో, అర్జీదారులకు ఫిర్యాదు చేసేందుకు సిబ్బంది స్టేషన్ వెలుపల టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఫిర్యాదుదారుల మధ్య పరస్పర చర్యలు కూడా వర్చువల్‌గా జరిగాయి.