తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై ఈ నెల 9న ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తో కలిసి ఉస్మానియా జర్నలిజం విభాగం సంయుక్తంగా తెలుగు జర్నలిస్టుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రారంభమైన 90 గంటల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న జాతీయ సదస్సులో యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ ప్రారంభించి ప్రసంగించనున్నారు. సీనియర్ జర్నలిస్ట్, డేటాలీడ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ సయ్యద్ నజాకత్, భూమ్ లైవ్ న్యూస్ దక్షిణాది ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన స్రవంతి మీడియా, యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్ పాల్గొంటున్న ఈ ప్రత్యేక కోర్సులో దాదాపు 50శాతం మంది మహిళా జర్నలిస్టులే కావటం విశేషం. గూగుల్ గుర్తింపుపొందిన ఫ్యాక్ట్ చెక్ శిక్షకుల ఆధ్వర్యంలో సామాజిక, వార్తా మాధ్యమాల్లో ప్రసారమయ్యే తప్పుడు సమాచారాన్ని తొలగించేందుకు ఉపయోగించే సాధనాలు, అభ్యాసాలపై శిక్షణ పొందుతున్నారు. ఈ మొత్తం శిక్షణా కార్యక్రమానికి యూఎస్ కాన్సులేట్ జనరల్ నిధులు సమకూరుస్తుండగా.. మౌళిక వసతులు, రవాణా ఓయూ జర్నలిజం విభాగం ఏర్పాటు చేస్తోంది.