బీఆర్ఎస్‌పై మైనంపల్లి ఫైర్‌

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త‌ వాతావరణం నెలకొని ఉంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,

By Medi Samrat  Published on  2 Oct 2023 5:47 PM IST
బీఆర్ఎస్‌పై మైనంపల్లి ఫైర్‌

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త‌ వాతావరణం నెలకొని ఉంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయ‌న‌ కుమారుడు రోహిత్ టీఆర్ఎస్ పార్టీని వీడి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరి హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో.. హనుమంతరావు అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో ఉద్రిక్త‌ వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌ భారీగా భారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే వాహనాలు తనిఖీలు కూడా చేప‌ట్టారు.

కొద్దిసేపటి క్రితమే మైనంపల్లి హనుమంతరావు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ కూడా ఎటువంటి సహాయం చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు చేసి రాజ్యమేలుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఐటీని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ర్యాలీ నిర్వహించడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. ఇది మరీ దారుణమన్నారు. తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు స్వాగ‌తం చెప్పేందుకు వస్తూ ఉంటే అడుగడుగునా బారికేడ్లను పెట్టారని.. వారు కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. నేను ప్రాణం సైతం లెక్కచేయకుండా పనిచేస్తానని.. తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదని మైనంప‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Next Story