స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ శనివారం హైదరాబాద్‌లో తన షో 'డోంగ్రీ టు నోవేర్'ని ఎట్టకేలకు విజయవంతంగా ప్రదర్శించారు. మునావర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. హిందూ దేవతలను అవమానించిన మునావర్ ను విడిచిపెట్టేదే లేదని పలువురు హెచ్చరికలు జారీ చేశారు. మునావర్ ప్రదర్శన ఇచ్చిన శిల్పకళా వేదిక హాలు లోపల, వెలుపల భారీ భద్రతను ఉంచారు.
ప్రదర్శనను తిలకించేందుకు దాదాపు 2300 మంది హాజరయ్యారు. రెండున్నర గంటల నిడివి గల స్టాండ్-అప్ షోను విజయవంతంగా నిర్వహించినందుకు హైదరాబాద్ పోలీసులకు మునావర్ కృతజ్ఞతలు తెలిపారు. తనను, ప్రేక్షకులను రక్షించినందుకు హైదరాబాద్ సిటీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
బీజేపీ శాసనసభ్యుడు టి రాజా సింగ్ ఈ ప్రదర్శనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మునావర్ హిందూ దేవుళ్ళను అవమానించారని ఆరోపిస్తూ వేదికను తగలబెడతామని బెదిరించారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో రాజా సింగ్ ను గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రదర్శనకు ముందు BJYMకి చెందిన పలువురు నాయకులను వివిధ పోలీసు స్టేషన్‌లలో నిర్బంధించారు. దాదాపు 20 మంది బీజేపీ మరియు బీజేవైఎం కార్యకర్తలు కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.