పోలీసుల అదుపులో మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసు నిందితులు

Moinabad farm house case accused in police custody. మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసులో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలను

By Medi Samrat  Published on  29 Oct 2022 11:29 AM GMT
పోలీసుల అదుపులో మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసు నిందితులు

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసులో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులను రిమాండ్‌కు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు.. షేక్‌పేట్‌లోని హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి వారిని మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.

నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు.. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని భావించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ఫై విచారణ జరిపిన హైకోర్టులోని మరో బెంచ్.. పోలీసు దర్యాప్తుపై మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేవరకు స్టే విధించింది. బీజేపీ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుల రిమాండ్‌కు సంబంధించి ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది.Next Story