హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్‌లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం ఆదేశించారు.
ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని సీఎం తెలిపారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతులు మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.