జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం కల్పించినందుకు అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్‌కు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు మూడు నెలల ముందే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మల నాగేశ్వరరావు గార్లు కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నా విజయం కోసం టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ నేతృత్వంలో న్యాయవాదులు ఎంతో కృషి చేశారని.. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు.
న్యాయం, ధర్మం కోసమే మా తండ్రి కృషి చేశారు.. ఇప్పటికీ ప్రజల కోసమే పని చేస్తుంటారన్నారు. గత 17 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనేక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానని.. నా గెలుపు కోసం ముఖ్యమంత్రి నుండి సామాన్య కార్యకర్త వరకు నా కోసం కష్టపడ్డారని గుర్తుచేశారు.
2015లో ఎంఐఎం నుండి పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచాను.. తరువాత బీఆర్ఎస్ నాకు బీ ఫామ్ రాకుండా చేసిందని.. నామీద కేసులు పెట్టీ ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. అండగా నిలిచిన అడ్వకేట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్ సమస్యలపై మా సహకారాలు అందిస్తామని తెలిపారు. వారి సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆశయాలను నిలబెడతాం.. వారికి అండగా నిలబడతామని పేర్కొన్నారు.