పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాతబస్తీ మెట్రో పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖకు సూచించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్‌తో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారని, పాతబస్తీ మెట్రోరైలు పనులకు కావాలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు.
గతంలో పాతబస్తీలో మెట్రోపై వ్యతిరేక స్వరం వినిపించింది. పలు మతపరమైన సంస్థలు, చరిత్రాత్మక నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉందని పలువురు మెట్రోకు నో చెప్పారు. ప్రస్తుతం అక్కడి ప్రజలు మెట్రో కావాలని కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో అక్కడ మెట్రో నిర్మాణానికి గల అడ్డంకుల విషయమై ప్రభుత్వం సర్వే చేయించింది. ఆ సర్వే పూర్తవడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.