హిజ్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడేమో ఓ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు
Man Married Hijra. హిజ్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తి..! మంచి మనసు ఉన్న వ్యక్తి.. ఓ హిజ్రాకు
By Medi Samrat Published on 17 April 2021 6:16 PM ISTహిజ్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తి..! మంచి మనసు ఉన్న వ్యక్తి.. ఓ హిజ్రాకు లైఫ్ ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఓ ఏడాది కాలం ఎంతో అన్యోన్యంగా గడిపారు. కానీ ఆ వ్యక్తి మనసులో ఓ దుర్బుద్ధి పుట్టింది. మరో అమ్మాయి మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. దీంతో పెళ్లి చేసుకున్న హిజ్రాను ఇబ్బందులకు గురిచేయడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి మాత్రమే కాకుండా.. అతడి కుటుంబ సభ్యులు కూడా హిజ్రాను ఎంతగానో వేధించి చాలా ఇబ్బందులు పెట్టారు. దీంతో ఆ ఇబ్బందులను భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఉంది.
ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్లేపల్లికి చెందిన బండారి నాగేందర్ (32), మల్లాపూర్, నేతాజీనగర్‌కు చెందిన గుత్తికొండ దివ్య (32) అనే హిజ్రాతో పరిచయం అయ్యింది. 2019 వరంగల్ మేడారం జాతరలో దివ్యను చూశాడట..! నాగేందర్ 2019 నవంబరులో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఏడాది పాటు దివ్య, నాగేందర్ ఆనందంగా గడిపారు. ఈ మధ్య నాగేందర్ కు వైష్ణవి అనే అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడు. దీంతో దివ్యను వదిలించుకుంటే వైష్ణవిని పెళ్లి చేసుకోవచ్చని నాగేందర్ అనుకుంటూ ఉన్నాడు. దీంతో దివ్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇక అతడి వేధింపులు తాళలేక దివ్య పోలీసులను ఆశ్రయించింది.
వైష్ణవిని వివాహం చేసుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని అందుకు అంగీకరించమంటూ మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడని దివ్య పోలీసుల ఎదుట వాపోయింది.. నాగేందర్ తల్లి శోభ, అక్క అఖిలవాణి తరచుగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.