హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని 'మంగళ గౌరి' వస్త్ర దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపులో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న పట్టు వస్త్రాలు, ఇతర దుస్తులు ఉండటంతో మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి. ప్రమాద సమయంలో లోపల ఉన్న సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. దట్టమైన పొగ మెట్రో స్టేషన్ పరిసరాలను కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.