ఢిల్లీ టూర్‌లో ఉన్న కేటీఆర్‌కు ఆ విషయాన్ని గుర్తుచేసిన అసదుద్దీన్ ఓవైసీ
KTR’s Delhi visit Owaisi reminds minister of old city’s metro project. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2023 1:00 PM IST
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన పర్యటనకు సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో మెట్రో లైన్ పొడిగించాలని ఎన్నో రోజులుగా అడుగుతున్నామని.. ఆ డిమాండ్‌ను పట్టించుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేటీఆర్ భేటీ, తెలంగాణలో పలు భూముల బదలాయింపును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ స్వాగతించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైల్ పొడిగింపు పెండింగ్‌లో ఉందని.. నిధుల సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. “కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసినప్పుడు, జేబీఎస్-ఫలక్‌నుమా మెట్రో లైన్‌కు నిధుల గురించి కూడా మాట్లాడుతారని ఆశిస్తున్నాను. ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఆ ప్రాంతంలో మెట్రో నిర్మాణం పనులు ప్రభుత్వాలు చేపట్టలేదు” అని ఆయన ట్వీట్ చేశారు.
JBS నుండి MGBSకి మెట్రో రైలు పొడిగింపు ముందుకు సాగడం లేదు. పాతబస్తీ ప్రాంతంలో 5.5 కి.మీ.ల మేర అభివృద్ధి పనులు పూర్తికాలేదు. మెట్రో డెవలప్మెంట్ మొదటి స్టేజీలో ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో మెట్రో రైలు వేయాలా వద్దా అనే అనుమానంతో పనులు మొదలుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ (2022-23)లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వాటితో ఎలాంటి పనులూ చేయలేదని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇప్పుడు ఖర్చు రూ. 2,500 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అంటున్నారు.
నగర శివారు ప్రాంతాల్లో మెట్రో పొడిగింపుకు ప్రాధాన్యత ఇస్తోంది: అసద్
ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడంపై అసద్ విచారం వ్యక్తం చేశారు. పాతబస్తీ మార్గం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు శివారు ప్రాంతాలపై దృష్టి సారిస్తోందని భావించారు. “ఇప్పటికే మంజూరైన మార్గాలను పూర్తి చేయడమే ప్రాధాన్యతగా ఉండాలి. విచిత్రమేమిటంటే, ఇటీవల ప్రకటించిన కందుకూరు-విమానాశ్రయ మార్గాన్ని పూర్తీ చేయడానికి ప్రభుత్వం పాతబస్తీ మార్గం కంటే ఎక్కువ శ్రద్ధ చూపెడుతోంది, ” అని అన్నారాయన. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు, ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ పొడిగింపు సమస్యను పరిష్కరించాలని అసదుద్దీన్ కూడా కోరారు.
కందుకూరును అనుసంధానం చేసేందుకు ఉత్సాహం చూపుతున్న సీఎం
జూన్ 20న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ మెట్రో రైలు కేవలం శంషాబాద్ వరకు మాత్రమే కాకుండా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని కందుకూరు వరకు కూడా విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ హర్దీప్ సింగ్ పూరీని కలవనున్నారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. ఎల్‌బీ నగర్‌లోని బీహెచ్‌ఈఎల్ వైపు మెట్రో రైలు పొడిగింపు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. రసూల్‌పురా సమీపంలోని ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేంద్ర హోంమంత్రిని కలిసే అవకాశం లభిస్తే బేగంపేట విమానాశ్రయానికి సమీపంలో హోంశాఖ ఆధ్వర్యంలో సుమారు నాలుగు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కేటీఆర్ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.