ఎక్కడా చూసినా చెత్త కుప్పలే.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు వ్యాఖ్యానించారు.

By అంజి  Published on  25 July 2024 7:00 AM GMT
KTR, Telangana govt, garbage, dengue, Hyderabad

ఎక్కడా చూసినా చెత్త కుప్పలే.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయని, దీంతో డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు.

చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నదన్న కేటీఆర్‌.. మేయర్‌, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతున్నదని అన్నారు. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. ''ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలి'' అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Next Story