త్వరలో హైదరాబాద్ కు వస్తాం : ఐఫోన్ తయారీదారు
త్వరలో హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తామని ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియు తెలిపారు.
By Medi Samrat Published on 16 Aug 2024 5:13 PM ISTత్వరలో హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తామని ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఆగస్టు 16 శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కూడా నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ చైర్మన్ బృందాన్ని న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కలిశారు. హైదరాబాద్ గొప్ప చరిత్ర, పారిశ్రామిక అవకాశాలు, అనుకూల వాతావరణం (పెట్టుబడుల కోసం) గురించి రేవంత్ రెడ్డి ఆయనకు వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) నుండి ఒక పత్రికా ప్రకటన వచ్చింది.
ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ లను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. తమిళనాడులో ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని టాటా ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలోని విస్ట్రాన్‌తో పాటు భారతదేశంలో ఆపిల్ కోసం వివిధ ఐఫోన్ మోడల్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. హైదరాబాద్‌పై కూడా ఫాక్స్‌కాన్ ఆసక్తి చూపినట్లు గతంలో వార్తలు వచ్చాయి.