హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన

హైదరాబాద్ నగరంలో గడిచిన మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి.

By అంజి  Published on  20 July 2023 6:27 AM GMT
Hyderabad, Heavy rains, IMD, Telangana

హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన

హైదరాబాద్ నగరంలో గడిచిన మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్‌ చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, బోరబండ, కూకట్ పల్లి, మాదాపూర్, ఫిల్మ్ నగర్ లలో పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని మేయర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిబ్బందికి సూచించారు. నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరవాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం 9000113667 నెంబర్ లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

ఎడతెరిపి లేకుండా శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శేర్లింగంపల్లి బ్రిడ్జి కిందకి వరద నీరు భారీ ఎత్తున చేరుకోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాలలో రోడ్లు తవ్వి వదిలెయ్యడంతో ఎక్కడ గుంతలు ఉన్నయ్యో తెలియక ప్రజలు, వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అండర్ పాస్ బ్రిడ్జి కింద భారీ ఎత్తున వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి కింద భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఆ వరద నీరులో ఒక కారు చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ మాన్సూన్ టీమ్, డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. ఆ కారును తోసుకుంటూ బయటికి తీసుకువచ్చారు. అటు గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్ గంజ్, కిసాన్ గంజ్, మహారాజ్ గంజ్, ఫిల్ ఖానా తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పేరుకు పోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పటేల్ నగర్‌లోని సాయి కృష్ణ అపార్ట్మెంట్ లోకి మోకాళ్ళ లోతు వరకు వరద నీరు చేరుకోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్డుపై భారీగా వరద నీరు చేరిపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది పెద్దమ్మ తల్లి టెంపుల్ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీరును క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్ష ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు వెంటనే డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే హైదరాబాదులో వరదనీరుతో భారీగా జామ్ అయిన 50 ప్రాంతాలు క్లియర్ చేశామని అధికారులు వెల్లడించారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాం పూర్ వెంకటేశ్వర కాలనీలో భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది. గత మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో మూసి నుండి ప్రవహించే నాల మొత్తం రోడ్డుపైకి రావడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.

Next Story