పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత

పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టుబ‌డింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలు జరగాల్సిందే.

By Medi Samrat  Published on  13 Jan 2025 8:06 PM IST
పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత

పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టుబ‌డింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలు జరగాల్సిందే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వయసు తేడా లేకుండా పతంగులు ఎగరేస్తూ ఉంటారు. అయితే ఈ పతంగులకు కట్టే దారం చైనా మాంజా ఉపయోగించడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండగ రాకముందే పలు దుకాణాలపై దాడులు చేసి భారీ ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈరోజు భోగి పండుగ. ఈ రోజు కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి హైదరాబాదులోని పాతబస్తీలో ఉన్న పలు షాపులపై రైడ్ చేశారు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపులపై సోదాలు కొనసాగించారు‌. మొత్తం 107 చోట్ల సోదాలు జ‌రిపి 148 మందిని అదుపులోకి తీసుకుని, 7300 మాంజాల‌ను సీజ్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 88 లక్ష‌ల‌ విలువచేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ ఏ. శ్రీనివాసరావు వెల్లడించారు.

Next Story