హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయాన్ని ఈ సంవత్సరం ఇప్పటివరకూ పదివేల మందికి పైగా టూరిస్టులు సందర్శించారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడం పిల్లలకు కేవలం ఒక ఎడ్యుకేషనల్ ప్లేస్‌గా మాత్రమే కాకుండా.. ఒక పిక్నిక్ ప్పాట్‌లా కూడా ఉంటుంది. పెద్దలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడం ద్వారా చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి నిలయంలో కొత్తగా పిల్లల కోసం మేజ్ గార్డెన్, చిల్డ్రన్స్ పార్క్, మ్యూజికల్ ఫౌండేషన్ ను త్వరలోనే నిర్మించబోతున్నట్టు, వాటికి ఫౌండేషన్ కూడా వేసినట్టు రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె రజిని ప్రియ మీడియాకు తెలియజేశారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో పబ్లిక్ రిలేషన్స్ చూసుకునే కుమార్ సమరేష్, జూన్ 15న హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు మీడియా ప్రతినిధులకు అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో టూర్ ఆపరేటర్లకు, ట్రావెల్ ఏజెన్సీలకు, ASSOCHAM వంటి బిజినెస్ గ్రూపులతో పాటు తెలంగాణలోని హోటల్స్ అసోసియేషన్లు, HYSEA & KITEA వంటి సంస్థలకు కూడా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని ఆయన తెలియజేశారు.
ఈ సంవత్సరం ఉగాది రోజు నుండి, అనగా మార్చి 22న, రాష్ట్రపతి నిలయాన్ని పబ్లిక్ కు సందర్శించే అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్రపతి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు సంవత్సరానికి 15 రోజులు మాత్రమే సందర్శకులకు ఇక్కడ ఉన్న పూదోటలు చూసేందుకు అవకాశం ఉండేది. రాష్ట్రపతి భవనం, ఇంటీరియర్స్ అన్నీ ఇప్పుడు సంవత్సరం అంతటా కూడా సందర్శకులు చూడొచ్చు.
రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలంటే ముందుగా రాష్ట్రపతి భవనం అఫీషియల్ వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవాలి. భారతీయులకైతే 50 రూపాయలు.. ఇతర దేశ సందర్శకులకు 250 రూపాయలకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు సోమవారాలు, మిగతా ప్రభుత్వ అధికారిక సెలవుల రోజులు తప్ప మిగతా అన్ని రోజులు రాష్ట్రపతి భవనాన్ని సందర్శించవచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చే విద్యార్థులకు అంటే 12 గ్రేడ్ వరకు అందరికీ ఎంట్రీ టికెట్లు ఉచితంగా అందజేస్తారు.