హైదరాబాద్ నుండి మణిపూర్ కు పయనం.. అక్కడే ఉంటూ
Hyderabad's Dr Prabhu Kumar travels to Manipur, provides medical relief to locals. స్కూల్ మొదలవ్వగానే ప్లెడ్జ్ మనం చెప్పే మాట.. 'ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్'..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 July 2023 4:15 PM GMTస్కూల్ మొదలవ్వగానే ప్లెడ్జ్ మనం చెప్పే మాట.. 'ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్'..! అంటే భారతీయులను మనం సోదర భావనతో చూడాలి.. ఈ మాట డాక్టర్ ప్రభు కుమార్ మెదడులో చిన్నప్పటి నుండీ నాటుకుపోయింది. భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రజలు బాధపడుతున్నా తట్టుకోలేరు. ఆయా ప్రాంతాలకు వెళ్లి సహాయం చేయడమే ఆయనకు తెలిసిన పని. తాజాగా మణిపూర్ ప్రజలకు సహాయం అందించే మిషన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం మణిపూర్ అట్టుడుకుతున్నదని అందరికీ తెలుసు. అక్కడకు వెళ్లాలంటేనే అందరూ జంకుతున్న సమయంలో డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి అక్కడకు వెళ్లి మణిపూర్ ప్రజలకు ఎంతో సాయం అందించారు. ఇది ఆయనకు ఒకరు చెప్పింటే చేసిన పని కాదు.. సొంతంగా తీసుకున్న నిర్ణయం. కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా ఆయనను వెళ్ళమని అన్నారు. మనసుకు, శరీరానికి గాయాలతో బాధపడుతున్న ఎంతో మందికి చికిత్స చేశారు ప్రభు కుమార్. మణిపూర్ ప్రజలకు నిజమైన తోడుగా.. అండగా.. నిలిచారు.
బంజారాహిల్స్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి ప్రస్తుతం మణిపూర్ లో ఉన్నారు. మణిపూర్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఓ వైపు ఉద్రిక్తతలు ఉండగా.. మరో వైపు సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ వైద్యం అందించే వ్యక్తులు ఉండడం ఎంతో ముఖ్యం. వెంటనే ప్రభు కుమార్ మణిపూర్ అధికారులను సంప్రదించారు. తాను అక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని చెప్పేశారంటే ఆయన కమిట్మెంట్ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు కుమార్ మాట్లాడుతూ "మణిపూర్ లో చోటు చేసుకుంటున్న హింసను చూసి చలించిపోయాను. కంగ్పోక్పి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడేశాను. ఆ ప్రాంతం హింసతో అట్టుడుకుతోంది. ఎంతోమంది గాయపడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న నా స్నేహితుని కూడా సంప్రదించాను. వెంటనే ఒక టీం ను రెడీ చేసుకొని మణిపూర్ కి వెళ్ళడానికి సిద్ధమయ్యాను." అని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అక్కడకు చేరుకోవడం కూడా చాలా కష్టమే. మొదట కలకత్తాకు చేరుకుంది ఆయన టీం. ఆ తర్వాత అక్కడ నుండి నాగాలాండ్. కారు దొరికితే కారు.. లేదంటే ఇతర వాహనాల్లో చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరారు. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. "మేము వెళ్లిన ప్రాంతంలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. నిరసనలు, హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతంలో శాంతి అనేదే లేకుండా పోయింది. ఆ ప్రాంతంలో పనిచేయడం, మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం కూడా రిస్క్ తో కూడుకున్నది. అయినా.. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి డాక్టర్ గా నా విధులు నేను నిర్వర్తించాలని అనుకున్నాను. ఏ ప్రాంతంలో అయితే డాక్టర్లు వైద్య సదుపాయాల అవసరం ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్లి మేము రోగులకు సహాయం చేయడం మొదలుపెట్టాం" అని అన్నారు ప్రభు. మొదట ముగ్గురు డాక్టర్లు కలిసి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాలనుకున్నారు. కానీ మిగిలిన ఇద్దరూ అనుకోని కారణాలవల్ల అక్కడికి చేరుకోలేకపోయారు. దీంతో ప్రభు కుమార్ ఒక్కరే మెడికల్ క్యాంపులో విధులు నిర్వర్తించాలని అనుకున్నారు. అక్కడకు వెళ్లిపోయారు. అయితే ఆయనకు అండగా కొందరు నిలబడ్డారు. "నేను తీసుకుంది చాలా కఠినమైన నిర్ణయమే కానీ నేను ప్రజలకు సహాయం చేయాలని ఫిక్స్ అయ్యాను. కష్టాల్లో ఉన్న వాళ్లకు తోచినంత సహాయం చేయడం నా కర్తవ్యంగా భావించాను. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలని అనుకున్నాను. ఎంతో కమిట్మెంట్తో పని చేశాను" అని ప్రభు కుమార్ చెప్పుకొచ్చారు.
ప్రభు కుమార్ తన 20 ఏళ్ల కెరీర్లో 5 వేలకు పైగా మెడికల్ క్యాంపులను నిర్వహించారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఆయన సేవలు అందించారు. కానీ మాణిపూర్ లో క్యాంపు ఏర్పాటు చేయడం పెద్ద సవాల్. ఈసారి ఆయనకు చాలా కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన మాట్లాడుతూ " మన పరిస్థితులకు అక్కడి పరిస్థితులకు చాలా తేడా ఉంది. నాకు సరైన ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టమైంది. అదృష్టవశాత్తు నేను ఆపిల్స్, బ్రెడ్, వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళాను. అక్కడ రైస్ దొరకడం చాలా కష్టమే. ఎప్పుడైనా అరుదుగా దొరికితే మాత్రం నేను నా వెంట తీసుకొని వెళ్లిన కారంపొడితో ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడిని. ఆహారం విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను" అని అన్నారు.
ఇక వైద్యం అందించడానికి డాక్టర్ ప్రభు తనతో పాటు పలు మెడిసిన్ లను తీసుకుని వెళ్లారు. మెడికల్ ఎక్విప్మెంట్ కి తోడుగా అక్కడి ప్రజలకు ఇవ్వడానికి దుప్పట్లు, బట్టలు కూడా తీసుకొని వెళ్లారు. ఆయన మెడికల్ క్యాంపు ద్వారా 600 మందికి పైగా చికిత్స అందించారు. చాలామంది డయేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉండగా కావాల్సిన చికిత్స అందించారు. చాలా మందికి సరైన వసతి సదుపాయం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించానని చెప్పారు ప్రభు. అలాగే డయాబెటిక్ చెకింగ్ మిషన్ కూడా తీసుకుని వెళ్ళారాయన..! చాలామందిలో షుగర్ లెవెల్స్ హై ఉన్నాయని తెలిసింది. ఇక ఆ ప్రాంతంలో స్థానికులతో మాట్లాడే భాష విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడే ఉన్న మెడికల్ ఆఫీసర్లు, ఇతర నర్సులు నేను చెప్పిన విషయాలను స్థానికులకు ట్రాన్స్లేషన్ చేయడం విశేషం. అక్కడ సేవలందించడానికి తన మెడికల్ ఎక్స్పీరియన్స్ కూడా పనికొచ్చిందని ప్రభు తెలిపారు.
తన మణిపూర్ జర్నీ అంత సులువుగా సాగలేదని కూడా డాక్టర్ ప్రభువు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కుటుంబం నేను మణిపూర్ వెళుతున్నాను అంటేనే భయపడ్డారు. నేను మణిపూర్ లో మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎవ్వరికీ ఇష్టం లేదు. కానీ అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించాను.. నా అవసరం ఎంతుందో వాళ్లకు తెలిపాను.. అప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను పంపించడానికి సరే అన్నారు. అక్కడున్న పరిస్థితులు ప్రభు కుమార్ కు ఎంతో చాలెంజింగ్ గా అనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వెనక్కు వచ్చేయాలని అనుకోలేదు. ఎంతోమందికి వైద్య సహాయం చేయడమే కాకుండా.. కష్టకాలంలో మనోధైర్యాన్ని కూడా నింపారు. మానవత్వం ఇంకా మిగిలే ఉందని మణిపూర్ ప్రజలకు భరోసాను ఇచ్చారు. "ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న" అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని అన్నారు ప్రభు కుమార్. అందుకే, ఆపదలో ఉన్నవారిని చేరదీసి ఆదుకున్నాను. అంతేకాకుండా, బాధిత వ్యక్తులకు మానసికంగా తోడ్పాటును అందించడం చాలా ముఖ్యం" అని అన్నారు. డాక్టర్ ప్రభు కుమార్ చేసిన నిస్వార్థ సేవ.. ఎంతో మందిని ప్రేరేపించింది.