ప్రస్తుతం సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన తన కుమార్తెను, ఆమె పిల్లలను రక్షించాలని హైదరాబాదీ మహిళ రెహానా బేగం విదేశీ వ్యవహారాల మంత్రి (MEA) డాక్టర్ ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన అల్లుడు ఖాజీ సైఫుల్లా ఖలీద్ తన కుమార్తె షేక్ అయేషా రుమానాను, ఆమె పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, ఎవరినీ కలవనివ్వకుండా, భారత్‌కు తిరిగి పంపించడం లేదని వాపోయింది.
రెహానా ప్రభుత్వానికి రాసిన లేఖను మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ ట్విట్టర్ లో షేర్ చేసిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆయేషా తన భర్త చిత్రహింసలను వివరించింది. వేధింపులకు సంబంధించిన వీడియోను కూడా ఖాన్ షేర్ చేశారు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత అయేషా తన భర్తతో కలిసి సౌదీ అరేబియాకు వెళ్ళిపోయింది. అక్కడే పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి ఆమె చిత్రహింసలకు గురవుతోంది. ఒక్కోసారి సైకోలా అతడు ప్రవర్తించేవాడని.. 5 సంవత్సరాలుగా తన కుమార్తెను ఇంటికి తిరిగి రానివ్వలేదని వాపోయింది రెహానా. అంతకు ముందు నా కూతురు హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడు, అక్కడ తనను ఎలా హింసించారో ఆమె వెల్లడించింది. అప్పుడు మేము ఆమెను తిరిగి వెళ్ళనివ్వలేదు, కాని రెండు కుటుంబాల పెద్దల ప్రమేయం, ఇకపై హింసించనని ఆమె భర్త హామీ ఇవ్వడంతో తిరిగి పంపించామని తెలిపింది. ఆరు నెలల కిందట తన కుమార్తె తిరిగి వెళ్లగా.. మళ్లీ భర్తతో టార్చర్ మొదలైంది. ఈ ఏడాది జూన్ 17న అయేషా తండ్రి షేక్ ఖమ్రుద్దీన్ మరణించగా.. అంత్యక్రియల కోసం తన కుమార్తెను హైదరాబాద్‌కు పంపలేదని తెలిపింది రెహానా. తన కుమార్తెను, ఆమె బిడ్డలను రక్షించి వీలైనంత త్వరగా భారత్‌కు పంపించాలని సంబంధిత అధికారులను రెహానా బేగం అభ్యర్థించింది.