అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు హైదరాబాద్ వీధుల నుంచి తెలంగాణ రాష్ట్రం నలుమూలల వరకు పాకింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని మొత్తం దోచుకుంటున్నారని ఆరోపిస్తూ శుక్రవారం భారీ 'మనీ హీస్ట్' హోర్డింగ్‌ను ఎల్‌బి నగర్‌లో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం నాడు మనీ హీస్ట్ దుస్తులు ధరించిన కొంతమంది యువకులు "మేము బ్యాంకును మాత్రమే దోచుకుంటాము, మీరు దేశం మొత్తాన్ని దోచుకోండి" అనే శీర్షికతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నగరంలో తిరుగుతున్నారు.
అంతకుముందు పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట, హైటెక్ సిటీ, అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్, మాదాపూర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ప్లెక్సీలలో #ByeByeModi అనే హ్యాష్‌ట్యాగ్ ను ప్రచురించారు. సాలు మోడీ.. సంపకు మోడీ.. అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలు, అగ్నిపథ్ పథకం, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు సంబంధించిన వంటి అంశాలను బ్యానర్లు, ప్లెక్సీలలో ప్రస్తావించారు. ఈ ప్లెక్సీలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు.