ఫార్ములా ఈ-రేస్‌ కు హైదరాబాద్ ఆతిథ్యం.. ఎప్పుడంటే

Hyderabad to host first ever Formula E race on February 11.హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2022 1:14 PM IST
ఫార్ములా ఈ-రేస్‌ కు హైదరాబాద్ ఆతిథ్యం.. ఎప్పుడంటే

హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ 'ఫార్ములా -ఈ' రేసు నిర్వహించనున్నారు. 'ఫార్ములా ఈ-రేస్‌' చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. దేశంలో జరిగే మొదటి 'ఈ-రేస్' కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు మీదుగా పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభత్వం ఏర్పాట్లు చేయనుంది.

ఫార్ములా1 మాదిరిగా 'ఈ–రేస్‌'కు ప్రత్యేక ట్రాక్‌ అవసరం ఉండదు. సాధారణ రోడ్లపైనే బ్యాటరీ కార్లతో రేసింగ్‌ నిర్వహిస్తారు. 2014–15లో ఈ పోటీలు మొదలయ్యాయి. భారత్ నుంచి మహింద్రా కంపెనీకి చెందిన 'మహింద్ర రేసింగ్‌'జట్టు పోటీ పడుతోంది. పలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్ కంపెనీలు కూడా ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. విద్యుత్ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో 'ఫార్ములా ఈ' సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా ఈకి స్వాగతం అంటూ హ్యాపెనింగ్ హైదరాబాద్ హ్యాష్ ట్యాగ్ జత చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 'ఫార్ములా ఈ' సీఈవో హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయనతో మంత్రి కేటీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

Next Story