హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ జన సమితి (టీజేఎస్) పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్ పేట్ లోని ఓయూ కాలనీలో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, మహ్మద్ అజారుద్దీన్ లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టిజెఎస్ మద్దతు కోరారని చెప్పారు.
రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. తెలంగాణ జన సమితి కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు ప్రచారంలో చురుకుగా పాల్గొని నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపించడంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలనే ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.