Hyderabad: 2 వేలకుపైగా కేసులు.. 48 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు

రాష్ట్రంలోని 508 కేసులతో సహా దేశవ్యాప్తంగా 2,194 కేసుల్లో ప్రమేయం ఉన్న 48 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) బుధవారం ప్రకటించింది.

By అంజి  Published on  14 Nov 2024 4:30 AM GMT
Hyderabad, TGCSB, arrest, cyber criminals, Crime

Hyderabad: 2 వేలకుపైగా కేసులు.. 48 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు 

హైదరాబాద్: రాష్ట్రంలోని 508 కేసులతో సహా దేశవ్యాప్తంగా 2,194 కేసుల్లో ప్రమేయం ఉన్న 48 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) బుధవారం ప్రకటించింది. వీరి మోసాల వల్ల బాధితులకు రూ.8.16 కోట్ల నష్టం వాటిల్లింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో స్థానిక పోలీసులతో టిజిసిఎస్‌బి నిర్వహించిన భారీ ఆపరేషన్‌ను అనుసరించి వీరిని అరెస్ట్‌ చేసినట్లు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు.

అరెస్టయిన వ్యక్తులు వ్యాపార పెట్టుబడి (ట్రేడింగ్) మోసాలు, ఉద్యోగ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, కొరియర్ స్కామ్‌లతో సహా పలు రకాల సైబర్ నేరాలకు పాల్పడ్డారని టీజీసీఎస్‌బీ తెలిపింది. అరెస్టయిన 48 మందిలో 38 మంది 'మ్యూల్' అకౌంట్ హోల్డర్లు కాగా, 10 మంది ఏజెంట్లు నేరస్థులకు మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారు.

ఏజెంట్లు తమ ఖాతాలను సైబర్ క్రైమ్‌లలో ఉపయోగించడానికి అనుమతించినందుకు కమీషన్ ఆధారిత ప్రోత్సాహకాల వాగ్దానాలతో ఖాతాదారులను ఆకర్షించారు. ఖాతాదారులు తెలిసి, ఇష్టపూర్వకంగా నేరస్థులు తమ ఖాతాలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకునేందుకు అనుమతించారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో నిరుద్యోగులతో పాటు క్యాబ్ డ్రైవర్లు, చిన్న వ్యాపార యజమానులు, ఐటీ ఉద్యోగులు వంటి నిపుణులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు 53 మొబైల్ ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐదు సీపీయూలు, 18 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 16 చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.

Next Story