నగరంలో జరిగే నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఈ మేరకు పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుండి జనవరి ఒకటో తేదీ వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే త్రీ స్టార్ హోటల్స్, క్లబ్బులు, పబ్బులు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత అవుట్ డోర్ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని అలాగే ఇండోర్ కార్యక్రమాలు రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించుకోవచ్చునని పోలీసులు స్పష్టం చేశారు.
వేడుకలలో మైనర్లకు ప్రవేశం నిషేధం.. అలాగే డ్రగ్స్, అశ్లీల కార్యక్రమాలు, ఫైర్‌వర్క్స్‌పై పూర్తిగా నిషేధం విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలు సురక్షితంగా, క్రమబద్ధంగా జరగాలి.. నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకారించాలని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా సురక్షితమైన వాతావరణంలో జరుపుకోవాలని.. నిర్వాహకులు, ప్రజలు తప్పనిసరిగా పోలీసులకు పూర్తిగా సహకరించాలని హైదరాబాద్ పోలీసులు కోరారు.