హైదరాబాద్: మహిళల భద్రత మరియు వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం 'షీ నేత్ర' (She Nethra) పేరుతో సరికొత్త విభాగాన్ని ప్రారంభించింది. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు మరియు విద్యా సంస్థల్లో రహస్య కెమెరాల బెడదను అరికట్టడమే లక్ష్యంగా నగరంలోని ఏడు జోన్లలో ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ట్రయల్ రూమ్‌లు, ఆస్పత్రులు, హాస్టళ్లలో రహస్య కెమెరాలు అమర్చి మహిళల ప్రైవసీకి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రాంగణాల్లో కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేశారు. ప్రతి సంస్థ తప్పనిసరిగా ఒక 'కస్టమర్ సేఫ్టీ ఇన్ చార్జీ'ని నియమించుకోవాలని, వారు షీ టీమ్స్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద కెమెరాలను గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని కోరారు.